Crude Oil Prices: పశ్చిమాసియాలో మళ్లీ నెలకొన్న భద్రతా ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రం కావడంతో అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి పరిసరాల్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్నాయి. వారాంతం తర్వాత ప్రారంభమైన అంతర్జాతీయ ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) రెండింటి ధరలు 3% పైగా పెరిగాయి.
ప్రపంచ ముడిచమురు రవాణాలో కీలక పాత్ర పోషించే హర్మూజ్ జలసంధి వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం ఇందుకు ప్రధాన కారణంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచ చమురు, ద్రవీకృత సహజవాయువు (LNG) రవాణాలో ఈ జలమార్గం అత్యంత కీలకమైనది. ఈ ప్రాంతంలో ఏ చిన్న అంతరాయం ఏర్పడినా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దీంతో ట్రేడర్లు, ఇంధన కంపెనీలు అప్రమత్తమయ్యాయి.
ఇదే సమయంలో హర్మూజ్ మార్గంలో వాణిజ్య నౌకల రాకపోకలు తగ్గినట్లు పలు అంతర్జాతీయ నివేదికలు సూచిస్తున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే ముడిచమురు సరఫరా వ్యయాలు పెరగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయనే ఆశలు కనిపించినప్పటికీ, తాజా పరిణామాలు ఆ అంచనాలను తారుమారు చేశాయి. దీంతో తాత్కాలిక శాంతి ప్రయత్నాల భవిష్యత్తుపై కూడా అనిశ్చితి నెలకొంది.
అంతర్జాతీయ ఇంధన మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తున్న నిపుణులు, గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గే వరకు చమురు ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగవచ్చని అభిప్రాయపడుతున్నారు.ఈ పరిణామాల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలపై కూడా పడే అవకాశముందని వారు చెబుతున్నారు.
Crude Oil Prices | ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన ప్రపంచ చమురు ధరలు
-








