హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేడు ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితి నెలకొంది. సూడాన్ దేశం నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడికి ఎబోలా(Ebola) వైరస్‌కు సంబంధించిన వైద్య చరిత్ర ఉందన్న అనుమానంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలో సాధారణ స్క్రీనింగ్ ప్రక్రియలో భాగంగా ప్రయాణికుడిని వైద్య బృందం పరీక్షించగా, అతని ఆరోగ్య వివరాల్లో గతంలో ఎబోలా సంబంధిత ఇన్‌ఫెక్షన్ హిస్టరీ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. దీంతో వెంటనే అధికారులు అతన్ని అదనపు పరీక్షల కోసం ప్రత్యేక పర్యవేక్షణలోకి తీసుకున్నారు.
తక్షణ చర్యల్లో భాగంగా ఆ ప్రయాణికుడిని ప్రత్యేక అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యుల బృందం నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తోంది. ఇతర ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం లేకుండా అన్ని భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో ప్రయాణికుడి నుంచి సేకరించిన రక్త నమూనాలను మరింత ఖచ్చితమైన పరీక్షల కోసం సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)కి పంపించారు.
తుది నివేదిక వచ్చిన తర్వాతే అసలు ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రానుందని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం నగర ఆరోగ్య శాఖ పూర్తిగా అప్రమత్తంగా ఉండగా, ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. పరీక్షల ఫలితాలపై ఆధారపడి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.








