TV advertisements: ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు మధ్యలో వచ్చే నిరంతర యాడ్స్‌పై ప్రేక్షకులు చాలాకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. టీవీ ఛానళ్లలో గంటకు గరిష్టంగా 12 నిమిషాలకే యాడ్స్ పరిమితం చేయాలన్న టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) నిబంధనలు పూర్తిగా సరైనవేనని కోర్టు స్పష్టం చేసింది.
ఈ నిబంధనలను సవాల్ చేస్తూ పలు నెట్వర్క్, బ్రాడ్‌కాస్టింగ్‌తో పాటు పలు న్యూస్ ఛానళ్ల అసోసియేషన్లు సహా మొత్తం 17 సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయి. యాడ్స్ తగ్గించడం వల్ల ఆదాయం తగ్గుతుందని, ఇది తమ వ్యాపార హక్కులకు భంగం కలిగిస్తుందని వారు వాదించారు.
అయితే జస్టిస్ అనిల్ క్షేత్రపాల్, జస్టిస్ అమిత్ మహాజన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లన్నింటినీ కొట్టివేసింది. కోర్టు తన తీర్పులో కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యాపార లాభాల కోసం లేదా ప్రజా వనరులను ఇష్టానుసారంగా వినియోగించుకోవడానికి రాజ్యాంగం ఎలాంటి హక్కు ఇవ్వదని స్పష్టం చేసింది.
ఒక గంటలో గరిష్టంగా 10 నిమిషాల కమర్షియల్ యాడ్స్, మరో 2 నిమిషాల ఛానల్ ప్రమోషన్లకు మాత్రమే అనుమతి ఉంటుందని కోర్టు తేల్చి చెప్పింది. TRAIకి ఈ విధమైన నియంత్రణలు పెట్టే అధికారం లేదన్న వాదనను కూడా కోర్టు తిరస్కరించింది. ప్రేక్షకుల అనుభవ నాణ్యత కూడా సేవలలో భాగమేనని, నిరంతర యాడ్స్‌తో వీక్షకులను ఇబ్బంది పెట్టకుండా నియంత్రించే అధికారం TRAlకి ఉందని కోర్టు పేర్కొంది.
ఈ నిబంధనలు న్యూస్, ఎంటర్టైన్మెంట్, ఫ్రీ మరియు పెయిడ్ ఛానళ్లన్నింటికీ సమానంగా వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో టీవీ యాడ్స్ పరిమితి అమలుకు మార్గం సుగమమైంది.








