Walmart CEO: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న 13 నిమిషాల్లో డెలివరీ సేవలు అత్యద్భుతమని వాల్‌మార్ట్ ఇంక్ ప్రెసిడెంట్, సీఈఓ జాన్ ఫర్నర్ ప్రశంసించారు. ఫ్లిప్‌కార్ట్‌కు మాతృసంస్థ అయిన వాల్‌మార్ట్ ఇప్పటికే సంస్థలో మెజార్టీ వాటాను కలిగి ఉంది.
2018లో వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను సుమారు 16 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.50 లక్షల కోట్లు) పెట్టుబడితో కొనుగోలు చేసింది. అనంతరం ఆ వాటాను 80 శాతానికి పైగా పెంచుకుంది. భారత్‌లో వినియోగదారులకు వేగవంతమైన డెలివరీ సేవలు అందించడంలో ఫ్లిప్‌కార్ట్ చూపుతున్న సామర్థ్యం, వినూత్న విధానాలు ప్రశంసనీయమని జాన్ ఫర్నర్ పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం 2026-27 తొలి త్రైమాసిక ఫలితాల సందర్భంగా మాట్లాడిన ఆయన, 13 నిమిషాల్లో డెలివరీ సేవలు అందించడం నిజంగా అద్భుతమని వ్యాఖ్యానించారు.
వేగవంతమైన డెలివరీ కోసం ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే 800కి పైగా డెలివరీ కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవస్థ ద్వారా భారత్‌లో 30కి పైగా నగరాల్లో సగటున 13 నిమిషాల్లోపే ఆర్డర్లు డెలివరీ అవుతున్నాయని తెలిపారు.
వాల్‌మార్ట్ ఫిబ్రవరి-జనవరి ఆర్థిక సంవత్సరాన్ని అనుసరిస్తుండగా, తాజా త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 7.3 శాతం పెరిగి 177.8 బిలియన్ డాలర్లకు చేరినట్లు వెల్లడించింది. ఇక ఫ్లిప్‌కార్ట్ సేవలను మరింత విస్తరించే దిశగా కీలక చర్యలు తీసుకుంటోంది.
లాస్ట్ మైల్ డెలివరీ కోసం భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం దేశవ్యాప్తంగా ఫ్లిప్‌కార్ట్ పార్సిళ్ల డెలివరీని భారత తపాలా శాఖ నిర్వహించనుంది.
ఇండియా పోస్ట్ విస్తృత నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని పట్టణాలు మాత్రమే కాకుండా చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగవంతమైన డెలివరీ సేవలను విస్తరించేందుకు ఫ్లిప్‌కార్ట్ ప్రణాళికలు వేస్తోంది.








