Telangana Governor: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివప్రతాప్ శుక్లా(Shiv Pratap Shukla) గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మొహమ్మద్ అజారుద్దీన్, ఎం. కోదండరాం ఎమ్మెల్సీలుగా ఎంపిక కావడం ఖరారైంది. దీంతో ఇద్దరూ త్వరలోనే శాసనమండలిలో ప్రవేశించనున్నారు.
గత ఏడాది ఆగస్టు 30న ఈ ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నియమించాలని తెలంగాణ కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. అయితే ఈ ఫైల్ చాలా కాలంగా పెండింగ్‌లో ఉండగా, తాజాగా గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రక్రియ పూర్తయింది.
ఈ నిర్ణయం రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా అజారుద్దీన్ మంత్రి పదవి కొనసాగాలంటే ఆయన ఏప్రిల్ 30లోపు శాసనమండలి సభ్యుడిగా అవ్వడం తప్పనిసరి. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎంపిక కావడంతో ఆయన మంత్రిగా కొనసాగడం ఖాయం అయింది.
ఇదిలా ఉండగా, ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గవర్నర్‌ను కలిసి చర్చించినట్లు సమాచారం. గవర్నర్ కోటాలో పెండింగ్‌లో ఉన్న ఈ పేర్లపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరిన నేపథ్యంలో, తాజాగా గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఈ పరిణామంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. గవర్నర్ నిర్ణయం రాష్ట్రంలో అధికార-ప్రతిపక్షాల మధ్య ఆసక్తికర రాజకీయ సమీకరణాలకు దారితీయొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.








