Sabarimala Case: శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సామాజిక సంస్కరణల పేరుతో మతంలోని ప్రాథమిక ఆచారాలను పూర్తిగా తొలగించడం సాధ్యం కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించింది.
విచారణలో భాగంగా కోర్టు, కోట్లాది మంది భక్తులు దశాబ్దాలుగా నమ్ముతున్న విశ్వాసాలను తప్పు అని ప్రకటించడం న్యాయస్థానాలకు సులభం కాదని పేర్కొంది. మతపరమైన అంశాల్లో మూడో వ్యక్తులు దాఖలు చేసే ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పరిమితులపై కూడా న్యాయమూర్తులు చర్చించారు.
ఆ మతంతో నేరుగా సంబంధం లేని వ్యక్తులు పిటిషన్లు వేయడంపై జస్టిస్ బి.వి. నాగరత్న ఆందోళన వ్యక్తం చేశారు.
ట్రావెన్‌కూర్ దేవస్వం బోర్డు తరపున హాజరైన సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 మధ్య సమతుల్యత అవసరమని వాదించారు.
వ్యక్తిగతంగా మతాన్ని అనుసరించే హక్కుతో పాటు, మత సంస్థలు తమ అంతర్గత వ్యవహారాలను నిర్వహించుకునే స్వేచ్ఛ కూడా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఆలయ ప్రవేశం అందరికీ ఉన్నప్పటికీ, ఆచారాల నిర్వహణ హక్కు ఆయా సంస్థలదేనని స్పష్టం చేశారు.
మతంలోని ఏ ఆచారం కీలకమో నిర్ణయించే అధికారం కోర్టులకు ఉండకూడదని, “ఎసెన్షియల్ రిలిజియస్ ప్రాక్టీస్” పరీక్షను పునఃపరిశీలించాలని సింఘ్వీ కోరారు. 2018 తీర్పును సవాలు చేస్తూ వచ్చిన ఈ పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది.








