Putaparthi MLA: సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని బీడుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రధాన అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ALSO READ:భారత్‌కు గర్వకారణం | మూడేళ్ల బుడ్డోడు చెస్‌లో ప్రపంచ రికార్డు
విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఎమ్మెల్యే సింధూర రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది విద్యార్థుల తల్లి ఖాతాల్లో ‘తల్లికి వందనం’ పథకం ద్వారా పెద్ద మొత్తం నిధులు పంపిణీ చేయడం ముఖ్యమైన అడుగు అన్నది ఆమె అభిప్రాయం. పిల్లల జీవితం సక్రమ దారిలో సాగడానికి తల్లిదండ్రుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

సెల్ ఫోన్ వినియోగం విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసిన ఆమె, చదువు సమయంలో మొబైల్‌ను దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. విద్యార్థుల్లో మానవతా విలువలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.
మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ విద్యనే భవిష్యత్తుకు ప్రధాన ఆస్తిగా అభివర్ణించారు. కష్టపడి చదువుతూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు.
అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను ప్రధాన అతిథులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
