Pakistan Airbases Damage:భారత్ దాడులకు 6 నెలలైనా కోలుకొని పాక్

Satellite images showing damage and ongoing repairs at Pakistan military bases after Indian airstrikes Satellite images showing damage and ongoing repairs at Pakistan military bases after Indian airstrikes

భారత్ దాడులకు 6 నెలలైనా పాక్ కోలుకోలేకపోవడాన్ని శాటిలైట్ చిత్రాలు రుజువు చేశాయి.ఈ ఏడాది మే నెలలో భారత్ జరిపిన సైనిక దాడుల నుంచి పాకిస్థాన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దాడులు జరిగి ఆరు నెలలు గడిచినా, దెబ్బతిన్న సైనిక స్థావరాల్లో మరమ్మతులు ఇంకా కొనసాగుతున్నాయని తాజా శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రముఖ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT) నిపుణుడు డేమియన్ సైమన్ తన విశ్లేషణ ద్వారా ఈ వివరాలను వెల్లడించారు.సైమన్ ఎక్స్ వేదికగా పంచుకున్న సమాచారం ప్రకారం రావల్పిండి సమీపంలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై భారత్ దాడి చేసిన ప్రదేశంలో పాకిస్థాన్ ఒక కొత్త నిర్మాణాన్ని చేపట్టింది.

ALSO READ:Telangana Cold Wave:తెలంగాణను వణికిస్తున్న చలి….డిసెంబర్‌ రాకముందే

పాక్ అణ్వాయుధాలను పర్యవేక్షించే స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఈ ఎయిర్‌బేస్ ఉండటం గమనార్హం. అదేవిధంగా, సింధ్‌లోని జేకబాబాద్ వైమానిక స్థావరంలో దెబ్బతిన్న హ్యాంగర్‌కు మరమ్మతులు ఇంకా కొనసాగుతున్నాయి.

అంతర్గత నష్టాన్ని అంచనా వేసేందుకే హ్యాంగర్ పైకప్పును దశలవారీగా తొలగిస్తున్నట్లు చిత్రాల్లో కనిపిస్తోందని సైమన్ వివరించారు.

ఏప్రిల్‌లో పాక్ ప్రేరేపిత పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా, మే నెలలో భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌పై దాడులు చేసింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా నూర్‌ఖాన్, జేకబాబాద్ సహా మొత్తం 11 పాక్ సైనిక స్థావరాలపై భారత దళాలు కచ్చితత్వంతో కూడిన దాడులు నిర్వహించాయి.

ఈ దాడుల వల్ల పాకిస్థాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని అప్పట్లో భారత వాయుసేన ప్రకటించింది. భారత క్షిపణులు తమ సైనిక స్థావరాలను తాకినట్లు ఆ సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా అంగీకరించడం తెలిసిందే. డేమియన్ సైమన్ శాటిలైట్ చిత్రాల విశ్లేషణలో నిపుణుడిగా గుర్తింపు పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *