తిరుమల పరకామణి చోరీ(TTD Parakamani Case) కేసులో శుక్రవారం పలువురు టీటీడీ అధికారులను డీజీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలోని సీఐడీ బృందం విచారించింది. తిరుపతి పద్మావతి అతిథిగృహంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, ఆర్థిక సలహాదారు, ముఖ్య గణాంకాధికారి అయిన బాలాజీ, అప్పటి వీజీవో బాలిరెడ్డి, అప్పటి తిరుమల సీఐ చంద్రశేఖర్‌ను విచారించారు.
అలాగే ఈ కేసులో నిందితుడు రవికుమార్‌ను పట్టుకున్న రోజు (2023 ఏప్రిట్ 29న) విధుల్లో ఉన్న ఐదుగురు పరకామణి సిబ్బందిని, పెద్దజీయర్ మఠంలోని ముగ్గురు స్వాములతో కలిపి మొత్తం 12(CID Investigation) మందిని అధికారులు విచారించారు.
విశ్వసనీయ వర్గాలు తెలిపిన మేరకు.. తొలుత జేఈవో వీరబ్రహ్మంతో జరిగిన విచారణలో ‘పరకామణి లెక్కింపునకు ప్రైవేట్ మఠాలైన పెద్ద జియ్యర్, చిన్న జియ్యర్ మఠం ఉద్యోగులను ఎలా అనుమతించారు? రవికుమార్ ఆస్తులను స్వాధీనం చేసుకునే అంశాన్ని పాలకమండలి సమావేశంలో ఎవరు పెట్టమన్నారు? టేబుల్ అజెండా పెట్టడానికి టీటీడీలో ఉండే నిబంధనలేంటి?’ అని ప్రశ్నించినట్టు తెలిసింది.
ALSO READ:Digital Arrest Scam:పులివెందులలో 12 మంది సైబర్ ముఠా గ్యాంగ్ అరెస్ట్
ఈ వివాదంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను తిరుపతి పరిపాలన భవనంలో ఉంటానని, అజెండాను ప్రొసీజర్ ప్రకారం సిధ్ధం చేస్తారని ఆయన చెప్పినట్టు తెలిసింది.
ఇక బాలిరెడ్డిని విచారిస్తూ ‘మీ సబ్‌ఆర్డినేట్, అప్పటి ఏవీఎస్వో సతీశ్ కుమార్ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత రవికుమార్‌ను విచారించారా? రాజీ విషయంలో అప్పటి సీవీఎస్వో పాత్ర ఉందా? టీటీడీకి డిప్యుటేషన్‌పై వచ్చేందుకు ఎవరు సపోర్ట్ చేశారు?’’ అని ప్రశ్నలు వేసినట్టు తెలిసింది.
తనకు తెలియదని ఎక్కువ ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తుడటంతో… కొండపై కీలక స్థానంలో ఉండి, తెలియదంటే ఎలా అంటూ, మళ్లీ పిలిచినప్పుడు రావాలని విచారణాధికారి చెప్పినట్టు సమాచారం.
పరకామణి కేసు ఫిర్యాదుదారుడు, మాజీ ఏవీఎస్వో సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యనార్ శుక్రవారం సాయంత్రం హుటాహుటిన అనంతపురం బయలుదేరి వెళ్లారు.
