జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేస్తూ, ఇలాంటి సున్నితమైన పరిస్థితుల్లో పిటిషన్లు దాఖలు చేసేటప్పుడు అపరిపక్వంగా కాకుండా బాధ్యతాయుతంగా ఉండాలని సూచించింది.
పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం కొంత అసహనం వ్యక్తం చేసింది. “దేశం ఇప్పటికే క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రజలందరూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమవాలి. మీ చర్యల ద్వారా భద్రతా బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు. మీరు కూడా దేశ పట్ల బాధ్యత ఉన్న పౌరులే కదా?” అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
ఉగ్రవాద దాడుల విషయంలో న్యాయ సమీక్ష చేయడం సరైన విధానం కాదని కోర్టు స్పష్టం చేసింది. “ఇలాంటి దర్యాప్తు వ్యవహారాలు నిపుణులకే వదలాలి. న్యాయమూర్తులు ఇలాంటి ఘటనలపై నిర్ణయం తీసుకునే నిపుణత కలిగినవాళ్లు కాదు” అని ధర్మాసనం వివరించింది. భద్రతా అంశాలను న్యాయస్థానాల్లోకి లాగొద్దని హెచ్చరించింది.
పిటిషనర్ మాత్రం ఇతర రాష్ట్రాల్లోని కశ్మీరీ విద్యార్థుల భద్రత కోసమే ఈ పిల్ దాఖలు చేశానని వివరించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, విద్యార్థుల భద్రత సమస్య అయితే సంబంధిత హైకోర్టులను ఆశ్రయించాలని సూచించింది. చివరికి పిటిషనర్ స్వచ్ఛందంగా తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు.