డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం చెన్నైలో ఐటీసీ చోళ హోటల్‌లో ప్రారంభమైంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక రాజకీయ నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్, డీలిమిటేషన్‌ను బీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిధుల పంపిణీలో వివక్ష చూపిస్తోందని, డీలిమిటేషన్ అమలైతే దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ దేశ జనాభాలో 2.8 శాతం మాత్రమే ఉన్నా, జీడీపీలో 5.1 శాతం మేర వాటా కలిగి ఉందని కేటీఆర్ వివరించారు. కేంద్రం రాష్ట్రాల నుంచి వసూలు చేసే పన్నుల్లో తెలంగాణకు సరైన వాటా అందడం లేదని విమర్శించారు. డీలిమిటేషన్ ద్వారా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు పెరగడం, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రభావం తగ్గించడం వ్యూహాత్మక కుట్ర అని వ్యాఖ్యానించారు.
ఈ సమావేశంలో డీలిమిటేషన్ ప్రతిపాదనపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ, కేంద్ర ప్రభుత్వ విధానాలను కఠినంగా ప్రశ్నించాలని నాయకులు నిర్ణయించారు. దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలూ సమిష్టిగా పోరాడాలని సూచించారు.