తెనాలి మండలం కటేవరం గ్రామం వద్ద అర్ధరాత్రి దారుణం జరిగింది. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆటోలో ప్రయాణికుడి మాదిరిగా ఎక్కి, అశోక్ కుమార్ అనే వ్యక్తిపై అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. అతని వద్ద ఉన్న రూ. 11,000 నగదును లూటీ చేసి పరారయ్యాడు. ఈ దాడితో అశోక్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు.
బాధితుడు డ్వాక్రా డబ్బులు కడదామని బయటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. అతని గొంతు, చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం అతడిని స్థానికులు వెంటనే తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితుడి గూర్చి సమాచారం సేకరిస్తున్నారు. ఘటన వెనుక పూర్తిస్థాయి వివరాలను తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది.
రాత్రివేళ ఒంటరిగా ప్రయాణించే వారిని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. దుండగుడిని త్వరలోనే గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
