యూపీలోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా కోసం ఏపీఎస్ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. విజయవాడ నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని జిల్లా ప్రజారవాణా అధికారి ఎంవై దానం సోమవారం ప్రకటించారు. ఈ 8 రోజుల యాత్రలో ప్రయాగరాజ్‌తో పాటు వారణాసి, అయోధ్య వంటి పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 1 నుంచి 8వ తేదీ వరకు ఈ యాత్రను ప్లాన్ చేశారు.
ప్రత్యేక బస్సులు ఫిబ్రవరి 1న ఉదయం విజయవాడ పీఎన్‌బీఎస్ నుంచి బయలుదేరి, 2వ తేదీ సాయంత్రానికి ప్రయాగరాజ్ చేరుకుంటాయి. 3వ తేదీ ప్రయాగరాజ్‌లో బస్ ఉండనుంది. 4న రాత్రి నుంచి అయోధ్యకు ప్రయాణం ప్రారంభమై, 5వ తేదీ ఉదయం అయోధ్య చేరుకున్నాక బాల రాముడి దర్శనం అనంతరం రాత్రికి కాశీకి ప్రయాణం జరుగుతుంది. 6న వారణాసికి చేరుకుని రాత్రి అక్కడ బస ఉంటుంది. 7వ తేదీ ఉదయం వారణాసి నుండి బస్సులు బయలుదేరి, 8వ తేదీ విజయవాడ చేరుకుంటాయి.
ఈ ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలు క్రింది విధంగా నిర్ణయించారు: సూపర్ లగ్జరీ- రూ.8,000, స్టార్ లైనర్ నాన్-ఏసీ స్లీపర్- రూ.11,000, వెన్నెల ఏసీ స్లీపర్- రూ.14,500. పిల్లలు మరియు పెద్దలకు ఛార్జీలు ఒకేలా ఉంటాయని ఆర్‌టీసీ అధికారులు తెలిపారు. యాత్రకు సంబంధించిన భోజనం, వసతి, ఇతర ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటాయి.
ముందస్తు రిజర్వేషన్ కోసం ఆన్‌లైన్, ఆర్టీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్లు, సమీప బస్ స్టేషన్లలో సంప్రదించాలని సూచించారు. 35, 29 మంది భక్తుల సమూహం అయితే, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరం, కొవ్వూరు నుంచి కూడా బస్సులు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.