ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుండి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమలు అవుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతు, ఈ కొత్త విలువలు ఇప్పటికే సుదీర్ఘంగా పరిశీలించబడినవని, అన్ని అవసరమైన కసరత్తులు పూర్తయ్యాయని చెప్పారు. అయితే, రాజధాని గ్రామాల్లో ఎటువంటి మార్పులు ఉండదని ఆయన స్పష్టం చేశారు.
గ్రోత్ సెంటర్లుగా గుర్తించబడిన ప్రాంతాల్లో మార్కెట్ విలువ 10 రెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని మంత్రి వివరించారు. కొన్ని ప్రాంతాల్లో అయితే, రిజిస్ట్రేషన్ విలువలు అక్కడి మార్కెట్ విలువల కంటే ఎక్కువగా ఉన్నాయని, అటువంటి ప్రాంతాల్లో విలువలు తగ్గుతాయని తెలిపారు.
అంతేకాకుండా, గత ప్రభుత్వ హయాంలో భూ అక్రమాలకు పాల్పడిన ఎమ్మార్వోలను అడ్డం పెట్టుకొని అక్రమంగా పేదల భూములను దారి మళ్లించిన వారికి కఠిన చర్యలు తప్పవని మంత్రి పేర్కొన్నారు. నేరం రుజువైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి పట్ల ఎటువంటి కాంప్రమైజ్ లేదు అని చెప్పారు.
భూ వివాదాలను పరిశీలించే సంబంధంలో 22ఏ భూములు, 596 జీవోలు, మరియు ఇతర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు కలెక్టర్లతో కమిటీలను నియమించనున్నట్లు మంత్రి వెల్లడించారు.