ఆదివారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదోని సైన్స్ కళాశాల నందు నిర్వహించిన “న్యూ జనరేషన్ యాక్టివిటీస్ 2024-25” కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రోటరీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు.
ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ విద్యార్థులు చదువు మరియు క్రీడల రెండింటిలోనూ ముందుండాలని, అవి జీవిత విజయానికి ముఖ్యమని చెప్పారు. చదువుతో పాటు క్రీడలు విద్యార్థులకు శారీరక మరియు మానసిక వికాసం కలిగిస్తాయని, మంచి ఆటగాళ్లుగా ఎదగడానికి అవకాశం కల్పిస్తాయని తెలిపారు.
ఆదోనిలో ఉన్న స్టేడియంల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి నిధులు సమీకరించడంపై దృష్టి పెట్టారని పార్థసారథి వెల్లడించారు. అన్ని రకాల క్రీడాకారులకు అధునాతన మౌలిక సదుపాయాలు అందించి, వారిని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని చెప్పారు.
చివరిగా, ఆదోనిలో 18 సంవత్సరాల వయస్సు గల క్రీడాకారుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలుచుకుంటే తన కల సాకారం అవుతుందని అన్నారు. క్రీడల ద్వారా జీవితంలో ఉన్నతమైన స్థాయికి చేరుకోవచ్చని యువతకు స్పష్టంగా సందేశం ఇచ్చారు.