మెదక్ జిల్లాలో స్త్రీనిధి ద్వారా మొత్తం 78 కోట్ల 19 లక్షల రుణాలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు 36 కోట్ల రూపాయల రుణాలు అందించడం జరిగిందని రీజనల్ మేనేజర్ గంగారం తెలిపారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో రుణాలకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు.
గతంలో అందించిన రుణాలకు సంబంధించి 75% రికవరీ చేయడం జరిగిందని, మిగిలిన 43 కోట్ల రూపాయల రుణాలను మూడు నెలల్లో అందించే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. డిఆర్డిఓ ఆదేశాల మేరకు వివోఏ సమావేశాలు ఏర్పాటు చేసి రుణాలను సమర్థవంతంగా పంపిణీ చేయనున్నట్లు గంగారం వెల్లడించారు.
చిన్న శంకరంపేట మండలంలో 9700 మంది సభ్యులకు రుణాలు అందించగా, ఐదు కోట్ల రూపాయల టార్గెట్‌లో కోటి 50 లక్షల రూపాయల రుణాలను మాత్రమే పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగతా రుణాలను మార్చి 31వ తేదీ వరకు పూర్తిచేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు.
మండలంలోని కొన్ని గ్రామాల్లో రికవరీ సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు. కామారం, జంగారై వంటి గ్రామాల్లో రికవరీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.