హైడ్రా అక్రమ నిర్మాణదారులపై కొత్త షాక్

HYDRA Is Shaking Up Hyderabad

హైదరాబాద్ లోని చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తూ ప్రజల అభిమానం చూరగొన్న హైడ్రా.. తాజాగా అక్రమ నిర్మాణదారులకు మరో షాక్ ఇచ్చింది. కూల్చివేతలకు అయ్యే ఖర్చు మొత్తం వారే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కూల్చివేతలకు సంబంధించి బుల్డోజర్లు, వాటికి ఇంధనం, ఆపరేటర్ కు వేతనం, కూల్చివేతల తర్వాత పోగవుతున్న వ్యర్థాల తరలింపు.. వీటికయ్యే ఖర్చు మొత్తం అక్రమ నిర్మాణదారుల నుంచే వసూలు చేస్తామని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తేల్చిచెప్పారు. ఇందుకోసం ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఆర్‌ఆర్‌ చట్టం కింద ఈ మొత్తం వ్యయాన్ని నిర్మాణదారుల దగ్గరే వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు.

వ్యర్థాల తరలింపునకు రూ.కోట్లలో ఖర్చు?
హైడ్రా ఇప్పటి వరకు సిటీలోని 18 ప్రాంతాల్లో 166 అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఇందులో పలు భారీ కట్టడాలు కూడా ఉండడంతో నిర్మాణ వ్యర్థాలు పెద్ద ఎత్తున పోగయ్యాయి. ఆక్రమణలు తొలగించడంతో పాటు చెరువులను పూర్వ స్థితిలోకి తీసుకురావడానికి తవ్వకాలు జరపాల్సి ఉంటుందని, భవిష్యత్తులో మళ్లీ కబ్జాలు జరగకుండా వాటి చుట్టూ ఫెన్సింగ్ వేయాల్సి ఉంటుందని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ చెప్పారు. వ్యర్థాల తరలింపుతో పాటు ఈ ఏర్పాట్లకు రూ.కోట్లలో ఖర్చవుతుందని ఆయన వివరించారు. అయితే, హైడ్రా వద్ద ప్రస్తుతం నిధులు ఆ స్థాయిలో లేవని ఆయన వివరించారు. ఇప్పటి వరకు జరిపించిన కూల్చివేతలకు ఇచ్చిన కాంట్రాక్టులోనే శిథిలాల తొలగింపును కూడా చేర్చామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *