ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. బీఏ రెండో సంవత్సరం చదువుతున్న 22 ఏళ్ల ఉజ్వల్ రాణాకు కాలేజీ ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో పరీక్ష రాయనివ్వలేదు. దీనిపై విద్యార్థి నిరసన తెలిపాడు.
అయితే, కాలేజీ యాజమాన్యం పోలీసులు రప్పించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. పోలీసులు తనను వేధించారని భావించిన ఉజ్వల్ తీవ్ర ఆవేశంతో తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
70 శాతం కాలిన గాయాలతో ఉజ్వల్‌ను ముందుగా స్థానిక ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం ఆయన మృతి చెందాడు.
ఈ ఘటన బుధానా ప్రాంతంలో తీవ్ర ఆందోళనకు దారితీసింది.
ALSO WATCH:https://youtu.be/dPugkrIJoR0
మృతుడి కుటుంబ సభ్యులు కాలేజీ మేనేజర్ అరవింద్ గార్గ్, ప్రిన్సిపాల్ ప్రదీప్ కుమార్, ఉపాధ్యాయుడు సంజీవ్ కుమార్ మరియు ముగ్గురు పోలీసులపై ఫిర్యాదు చేశారు.
వీరిని విద్యార్థి మరణానికి కారణమని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ నంద్ కిషోర్, కానిస్టేబుళ్లు వినీత్, జ్ఞాన్‌వీర్‌లను విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు పోలీస్ లైన్‌కు అటాచ్ చేశారు.
ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. ప్రైవేట్ కాలేజీల ఫీజు నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వడంతోపాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశాయి.
