ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు చివరకు భారతీయ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ యుద్ధ వాతావరణం కారణంగా ఇప్పటివరకు ఐదుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు విదేశాంగ శాఖ అధికారికంగా ధ్రువీకరించింది. ఒమన్‌లోని సోహార్ పారిశ్రామిక ప్రాంతంపై జరిగిన దాడిలో డ్రోన్ శకలాలు పడటంతో ఇద్దరు భారతీయులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు, హార్ముజ్ జలసంధి వద్ద ఇరు దేశాల మధ్య ఘర్షణల కారణంగా చిక్కుకుపోయిన ఒక నౌకలో మరో ముగ్గురు భారతీయులు మరణించినట్లు సమాచారం అందింది. దీంతో ఈ యుద్ధ ప్రభావం వల్ల మరణించిన భారతీయుల సంఖ్య ఐదుకు చేరింది. యుద్ధ క్షేత్రంలో ఉన్న భారతీయుల భద్రతపై విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. బాధితుల కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది.





