హైదరాబాద్ బంజారాహిల్స్‌లో తుపాకీతో హల్‌చల్ చేసిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అర్థరాత్రి ఓపెన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ, డ్యాష్‌బోర్డుపై తుపాకీ ఉంచి, గాల్లోకి ఊపుతూ ప్రజలను భయపెట్టారు. ఈ సంఘటన నగర వ్యాప్తంగా కలకలం రేపింది.
ఈ యువకులు స్వయంగా ఈ వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో వైరల్ కావడంతో బంజారాహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రధాన నిందితుడిగా అఫ్సర్ అనే యువకుడిని గుర్తించి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. వారు ప్రయాణించిన జీపును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ఇతర యువకుల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. వీరి వద్ద ఉన్న తుపాకీ అసలైనదేనా, లేక నకిలీదా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. కేసు నమోదు చేసి, మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశముంది.
పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ, ఇలాంటి సంఘటనలను ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. పబ్లిక్ ప్రదేశాల్లో భద్రతను భంగం కలిగించేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.