TVK Vijay: తమిళ రాజకీయాల్లో అడుగుపెట్టిన టీవీకే పార్టీకి ఎన్నికల ముందే ఊహించని షాక్ తగిలింది. ఎడప్పాడి నియోజకవర్గంలో ఆ పార్టీ తరఫున దాఖలైన ప్రధాన అభ్యర్థి, ప్రత్యామ్నాయ అభ్యర్థి నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో టీవీకేకు పోటీ ప్రారంభమయ్యేలోపే ఒక కీలక సీటు దూరమైన పరిస్థితి ఏర్పడింది.
అధికారిక సమాచారం ప్రకారం, టీవీకే అభ్యర్థి అరుణ్‌కుమార్ నామినేషన్ పత్రాల్లో ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా అవసరమైన ప్రతిపాదకుల సంతకాలు పూర్తి కాలేదు. నిబంధనల ప్రకారం కనీసం 10 మంది ప్రతిపాదకుల సంతకాలు తప్పనిసరిగా ఉండాలి. అయితే ఆయన దాఖలు చేసిన పత్రాల్లో కేవలం 8 సంతకాలు మాత్రమే ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇక ప్రత్యామ్నాయ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నిత్య పత్రాల్లో కూడా ఇదే లోపం బయటపడింది. ఆమె నామినేషన్‌లో కేవలం 7 మంది ప్రతిపాదకుల సంతకాలు మాత్రమే ఉండటంతో, ఎన్నికల సంఘం దానినీ చెల్లనిదిగా ప్రకటించింది.
ఈ పరిణామం టీవీకే చీఫ్ విజయ్ కు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ, ప్రాథమిక నిబంధనల విషయంలో చోటుచేసుకున్న ఈ నిర్లక్ష్యం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఎడప్పాడిలో ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.








