ప్రమాద స్థలంలో విషాదం
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి చెందిన సంఘటనలో, పి. జంగారెడ్డిగూడెం మండలం తడువాయి సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శశి ఇంజనీరింగ్ కాలేజీ తాడేపల్లిగూడెంలో చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు, లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఒకరు మృతి – ఐదుగురికి గాయాలు
ఈ ఘటనలో ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు.
భద్రాచలం టూర్‌కు వెళ్తుండగా ప్రమాదం
ఈ విద్యార్థులు భద్రాచలం టూర్ కోసం ప్లాన్ చేసుకుని కారులో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. మార్గ మధ్యంలో తడువాయి వద్ద వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
స్థానికుల స్పందన – విచారంలో కుటుంబాలు
ప్రమాదం చూసిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసుల విచారణ కొనసాగుతోంది.