నర్సింగ్ మండలం వల్లూరు గ్రామంలో రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమాన్ని ఎస్సై అహ్మద్ మోయుద్దిన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామస్తులకు రోడ్డు ప్రమాదాల తీవ్రతపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చే యజమానులపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు వివరించారు.
వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటుబెల్ట్‌లు ధరించాలని సూచించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. వల్లూరు గ్రామంలోని జాతీయ రహదారి వద్ద తరచుగా ప్రమాదాలు జరుగుతుండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది యాదగిరి, రమేష్, లావణ్య, కాజా పాల్గొన్నారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచి, అనేకమంది ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు కృషి చేస్తున్నట్లు తెలిపారు.