భారతదేశంలోని మొత్తం బ్యాంకు ఖాతాల్లో 39.2 శాతం ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయి. విశేషంగా, పట్టణ మహిళల కంటే గ్రామీణ మహిళల ఖాతాలే అధికంగా ఉండటం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల పేరిట ఉన్న బ్యాంకు ఖాతాల శాతం 42.2గా ఉంది. ఈ గణాంకాలు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ‘ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024’ నివేదికలో వెల్లడయ్యాయి. జనాభా, ఆరోగ్యం, విద్య, ఆర్థిక భాగస్వామ్యం వంటి అనేక రంగాల్లో లింగ ప్రాతిపదికన సమగ్ర సమాచారం ఈ నివేదికలో ఉంది.
డీమ్యాట్ ఖాతాల విషయానికి వస్తే, స్టాక్ మార్కెట్‌పై మహిళల ఆసక్తి కూడా రోజురోజుకు పెరుగుతోంది. 2021 నుంచి 2024 నవంబర్ వరకు డీమ్యాట్ ఖాతాలు 3.32 కోట్ల నుంచి 14.3 కోట్లకు పెరిగాయి. ఇందులో 2021లో మహిళల డీమ్యాట్ ఖాతాల సంఖ్య 0.667 కోట్లుండగా, 2024 నాటికి అది 2.77 కోట్లకు చేరింది. పురుషుల ఖాతాల సంఖ్య ఇప్పటికీ అధికంగానే ఉన్నా, మహిళల వృద్ధి గణనీయంగా ఉంది. ఈ గణాంకాలు మహిళలు ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని నిరూపిస్తున్నాయి.
వ్యాపార రంగంలో కూడా మహిళల ప్రభావం కనిపిస్తుంది. 2017లో కనీసం ఒక మహిళ డైరెక్టర్‌గా ఉన్న స్టార్టప్‌లు 1,943 మాత్రమే ఉండగా, 2024 నాటికి 17,405కి పెరిగాయి. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొన్నట్లు, మహిళా యాజమాన్య సంస్థలు తయారీ, సేవా రంగాల్లో విస్తరిస్తున్నాయి. ఇది మహిళా వ్యవస్థాపకతకు చిహ్నంగా భావించవచ్చు. అలాగే, మహిళలు స్వయం ఉద్యోగాలు ప్రారంభించడం ద్వారా ఆర్థిక స్వావలంబనకు దారి తీస్తున్నారు.
ఎన్నికల వ్యవస్థలో కూడా మహిళల భాగస్వామ్యం గణనీయంగా మారింది. 1952లో 17.32 కోట్ల ఓటర్లలో మహిళల శాతం తక్కువగా ఉండగా, 2024 నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 97.8 కోట్లకు పెరిగింది. ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య భారీగా పెరగడంతో లింగ ఆధారిత ఓటింగ్ అంతరం తగ్గింది. విద్యా రంగంలోనూ ప్రాథమిక స్థాయిలో లింగ సమానత్వ సూచిక (GPI) పెరుగుతున్నది. ఉన్నత విద్యా స్థాయిలలో కూడా మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుండటం మహిళా శక్తి పెరుగుతున్నదాని సూచన.