తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కి పరిమితమైపోయారు. గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, నియోజకవర్గాన్ని సందర్శించలేదు. అసెంబ్లీ సమావేశాలు దాదాపు 60 రోజులు జరిగినా, కేవలం రెండుసార్లు మాత్రమే సభకు హాజరయ్యారు. ఈ వ్యవహారంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
గజ్వేల్ ప్రజలు ఓటేసి గెలిపించినప్పటికీ, కేసీఆర్ ఒక్కసారి కూడా నియోజకవర్గాన్ని చూసేందుకు రాలేదని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన 15 నెలల్లో ప్రజలకు కనీసం ముఖం చూపించలేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బుధవారం గజ్వేల్‌లో కాంగ్రెస్, బీజేపీ నేతలు వేర్వేరుగా నిరసనలు చేపట్టారు.
కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ వద్ద కాంగ్రెస్, బీజేపీ నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. క్యాంప్ ఆఫీస్ గేటుకు ‘టు లెట్’ బోర్డు పెట్టారు. ‘ఎమ్మెల్యే మిస్సింగ్’, ‘వాంటెడ్’ అంటూ నినాదాలు చేశారు. అంతేకాదు, తమ ఎమ్మెల్యే కనిపించడంలేదంటూ గజ్వేల్, గౌరారం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ప్రజలకు సేవ చేయలేని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసనలపై బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కు తాళం వేసి, బీజేపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. దీంతో బీజేపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో గజ్వేల్ రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది.