మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని కెసిఆర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద పోలీసులు ప్రత్యేక నిర్బంధ తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తూప్రాన్ డిఎస్పి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో 105 మంది పోలీస్ సిబ్బంది తెల్లవారుజామునుంచి తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను పోలీసులు పరిశీలించారు.
ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని వంద ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతులేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. ప్రజల భద్రత కోసం ఈ చర్యలు తీసుకున్నట్టు డిఎస్పి వెంకటరెడ్డి తెలిపారు. తూప్రాన్ పరిధిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తుల వివరాలను పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.
సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిఎస్పి సూచించారు. అనవసరమైన లింక్స్‌పై క్లిక్ చేయకుండా, అనుమానాస్పద ఫోన్ కాల్స్‌కు స్పందించకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అలాగే, ప్రజలు ఎలాంటి మోసాలకు గురికాకుండా పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను ఉపయోగించవద్దని డిఎస్పి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. నిర్బంధ తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహిస్తామని తెలిపారు. ప్రజల సహకారంతోనే పట్టణంలో శాంతిభద్రతలు మెరుగవుతాయని ఆయన పేర్కొన్నారు.