Pakistan Petrol Price: తీవ్ర ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత మధ్య పాకిస్థాన్ ప్రభుత్వం కీలక యూ-టర్న్ తీసుకుంది. కేవలం ఒక్క రోజు ముందే పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచిన ప్రభుత్వం..
ఇప్పుడు లీటర్ పెట్రోల్‌పై రూ.80 తగ్గింపు ప్రకటించింది. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ శుక్రవారం అర్థరాత్రి ఈ నిర్ణయాన్ని ప్రకటించగా, తాజా తగ్గింపుతో అక్కడ పెట్రోల్ ధర లీటరుకు రూ.378కు చేరుకుంది. ఈ ఉపశమనం పెట్రోలియం లెవీలో కోత ద్వారా అమల్లోకి తీసుకొచ్చినట్లు అక్కడి మీడియా తెలిపింది.
ఇదిలా ఉంటే, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు మరియు అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ముడి చమురు ధరలను కారణంగా చూపుతూ, పాకిస్థాన్ ప్రభుత్వం కేవలం ఒక రోజు ముందే పెట్రోల్ ధరను రూ.458.40కు, డీజిల్ ధరను రూ.520.35కు పెంచింది.
ఈ పెంపుపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో, ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీంతో ప్రజా ఒత్తిడికి లోనై తీసుకున్న నిర్ణయంగా ఈ తగ్గింపును విశ్లేషకులు చూస్తున్నారు.
ఇక సామాన్యులకు కొంత ఊరట కల్పించేందుకు టూ వీలర్ వినియోగదారులకు లీటరుకు రూ.100 సబ్సిడీ కూడా ప్రకటించినట్లు పాక్ మీడియా నివేదించింది.
పరిమిత కాలానికి అమల్లో ఉండే ఈ సబ్సిడీతో పాటు, సౌదీ అరేబియా, యూఏఈ దిగుమతులపై అధిక ఆధారపడటం వల్ల అంతర్జాతీయ చమురు ధరల మార్పులు పాకిస్థాన్‌పై నేరుగా ప్రభావం చూపుతున్నాయి.
వరుస ధరల పెంపులతో విసిగిపోయిన ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కట్టి నిరసనలు తెలపడంతో, ప్రభుత్వం తక్షణ ఉపశమన ప్యాకేజీ ప్రకటించాల్సి వచ్చింది.








