బోడుప్పల్ కేశవనగర్ కాలనీలో శ్రీ అన్నపూర్ణ దేవి సహిత విశ్వనాథస్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రిని పూర్ణకుంభం, మంగళహారతులతో పూజారులు, కాలనీ ప్రజలు సన్మానించారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి విశ్వనాథస్వామి ఆశీస్సులు పొందారు.
ప్రతిష్టాపన అనంతరం ఆలయంలో నిర్వహించిన హోమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న దాతలకు, శిల్పులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలంతా సుఖశాంతులతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని విశ్వనాథస్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. బోడుప్పల్ ప్రజల కోసం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పేదలకు ఇళ్లు అందించడంపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని మంత్రి అన్నారు. హైదరాబాదులో నిరుపేదలకు ఇళ్లు కట్టించే కార్యక్రమం దశాబ్ద కాలంగా ఆలస్యం అయిందని, తమ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తుందని చెప్పారు. బోడుప్పల్ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తీరేందుకు వచ్చే 18 నెలల్లో ఉప్పల్-ఘట్‌కేసర్ ఫ్లైఓవర్ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
అలాగే, తెలంగాణలో పేద ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. కాశీ విశ్వనాథుని ఆశీస్సులతో ప్రజల కోసం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి తెలిపారు. అద్భుతమైన శిల్పాలతో ఆలయాన్ని నిర్మించిన శిల్పులకు, ఆలయ నిర్మాణ బాధ్యత తీసుకున్న ధర్మకర్తలకు మంత్రి అభినందనలు తెలిపారు.