Medaram Jatara: దేశంలోనే అతి విశాలమైన గిరిజన ఆధ్యాత్మిక ఉత్సవంగా గుర్తింపు పొందిన మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. రెండేళ్లకోసారి అపూర్వ వైభవంతో నిర్వహించే ఈ మహాజాతరలో కోట్లాది భక్తుల ఆరాధ్యదైవాలైన సమ్మక్క–సారలమ్మ తల్లులు గద్దెలపై కొలువుదీరనున్నారు. బుధవారం ప్రారంభమైన ఈ జాతర ఈ నెల 31 వరకు కొనసాగనుంది.
జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.251 కోట్లను వెచ్చించి తల్లుల గద్దెల ప్రాంతాన్ని పూర్తిగా పునర్నిర్మించడంతో పాటు భక్తులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించింది. తెలంగాణతో పాటు దేశం నలుమూలల నుంచి ఆదివాసీలు, ఇతర భక్తులు కలిపి కోటి మందివరకు మేడారానికి తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సారలమ్మ ఆగమనంతో జాతర ఆరంభం
మహాజాతర తొలి రోజున కన్నెపల్లి జాబిల్లిగా పూజలు అందుకునే సారలమ్మ మేడారానికి చేరుకున్నారు. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జంపన్న వాగు మీదుగా గద్దె ప్రాంగణానికి తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజు, గోవిందరాజులతో కలిసి ముగ్గురు దేవతలు గద్దెలపై కొలువుదీరనున్నారు.
కీలక ఘట్టం సమ్మక్క ఆగమనం
జాతరలో అత్యంత ప్రాధాన్యమైన ఘట్టమైన వనదేవత సమ్మక్క ఆగమనం గురువారం జరగనుంది. కుంకుమభరిణి రూపంలో సమ్మక్క రాక సందర్భంగా సంప్రదాయ గౌరవాలతో గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. శుక్రవారం భక్తులు ఎత్తు బంగారాలను సమర్పించుకోగా, శనివారం వనప్రవేశంతో మహాజాతర ముగుస్తుంది.
సాంకేతికతకు పెద్దపీట
ఈసారి మేడారం మహాజాతరలో తొలిసారిగా ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నారు. తప్పిపోయిన చిన్నారులను గుర్తించేందుకు ప్రత్యేక ఏఐ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. మొత్తం 21 ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. ఇప్పటికే సుమారు 50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.
also read:Tiger Census Telangana: 994 వన్యప్రాణుల ఆనవాళ్లు నమోదు







