బంగ్లాదేశ్‌లోని జైలు నుంచి 23 మంది భారతీయ మత్స్యకారులు విడుదలయ్యారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశాఖపట్నం వాసులైన 9 మంది మత్స్యకారులు ఉండటం గమనార్హం. బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ మహమ్మద్ అఫీజ్ ఆల్ అసాద్, భారత డిప్యూటీ హై కమిషన్ ప్రతినిధి చంద్ర జీత్‌తో పాటు ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో మత్స్యకారుల విడుదల ప్రక్రియను అధికారికంగా పూర్తి చేశారు.
విడుదలకు సంబంధించిన అన్ని న్యాయపరమైన ప్రక్రియలను బంగ్లాదేశ్ జిల్లా మేజిస్ట్రేట్ సమక్షంలో ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. బాగర్హాట్ జైలు నుంచి విడుదలైన అనంతరం, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మత్స్యకారులను మోంగ్లా పోర్టుకు తరలించారు.
ఇక బంగ్లాదేశ్ అధికారులు స్వాధీనం చేసుకున్న భారత మత్స్యకారుల బోట్లకు సంబంధించిన మరమ్మతులు త్వరితగతిన కొనసాగుతున్నాయని, అవి రేపటిలోపు పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం. అన్ని ఏర్పాట్లు పూర్తైన అనంతరం ఈ నెల 29న మత్స్యకారులు భారత్‌కు తిరుగు ప్రయాణం ప్రారంభించనున్నారు.
ఈ పరిణామంతో మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసిందని స్థానిక వర్గాలు వెల్లడించాయి.
ALSO READ:India–EU Trade Deal | బడ్జెట్‌లో ప్రజలకు ఊరట..భారత్–ఈయూ డీల్‌తో ధరల తగ్గుదల
