Kalvakuntla Kavitha: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతూ కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు తన కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా స్థాపించనున్నట్లు వెల్లడించారు.
మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అధ్వయ కన్వెన్షన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించి పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటించనున్నట్లు తెలిపారు.
అదే రోజున పార్టీ పేరు, జెండాను కూడా ఆవిష్కరించనున్నట్లు కవిత స్పష్టం చేశారు. శ్రీరామనవమి శుభదినం సందర్భంగా ఈ కీలక ప్రకటన చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశను చూపించే లక్ష్యంతో ఈ పార్టీని తీసుకొస్తున్నట్లు ఆమె సంకేతాలిచ్చారు.
యువత, మహిళలకు తమ పార్టీలో ప్రత్యేక స్థానం ఉంటుందని కవిత వెల్లడించారు. ఇప్పటివరకు పురుషుల ఆధ్వర్యంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయని, ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డగా తాను పార్టీ స్థాపిస్తే ప్రజలు ఎలా స్వీకరిస్తారో చూడాలని వ్యాఖ్యానించారు.
కవిత ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆమె కొత్త పార్టీపై, దాని రాజకీయ దిశపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది.








