స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా పేరు పొందారని, భారతదేశాన్ని సూపర్ పవర్‌గా తీర్చిదిద్దాలనే గొప్ప సంకల్పంతో దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. వారి ఆశయాలను, ఆకాంక్షల కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవా భవన్, క్యాంపు కార్యాలయంలో ఇందిరా గాంధీ 107వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు వేడుకల్లో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళ్లర్పించారు. ఆమె దేశానికి అందించిన సేవలను, కుటుంబ త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. మహిళా శక్తికి, మహిళాలోకానికి ఇందిరాగాంధీ దిక్చూచిగా, రోల్ మోడల్‌గా నిలిచారని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఆనాడు కాంగ్రెస్ పార్టీని, ప్రధానిగా భారతదేశాన్ని విజయవంతంగా ఒంటిచేత్తో నడిపారని, ప్రత్యర్థుల కుట్రలను చిత్తుచేసి తిప్పి కొట్టారన్నారు. ఆమె తన జీవితాన్ని ఫణంగా పెట్టి భారతదేశ అభివృద్ధి కోసం పాటుపడ్డారన్నారు. దేశంలో గరిబీ హటావో నినాదంతో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. ఈ ఐదేండ్లలో తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ పాలనను స్ఫూర్తిగా తీసుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయనున్నట్టు తెలియజేశారు. మహిళాశక్తిని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు.ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డి కంకణబద్ధులై ఉన్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో తెలంగాణ ఆడపడుచులను దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు.ఈ కార్యక్రమం లో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.