ibomma ravi: తెలుగు సినీ ఇండస్ట్రీని గజగజలాడించిన పైరసీ కేసులో ఐబొమ్మ రవి పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల అరెస్ట్ అయిన రవిని పోలీసులు మూడోసారి సైబర్‌క్రైమ్ కస్టడీకి అప్పగించారు. నాంపల్లి కోర్టు 12 రోజుల పాటు విచారణకు అనుమతి ఇచ్చింది. కస్టడీ విచారణలో రవి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించినట్టు అధికారులు తెలిపారు.
తాను సినిమా వెబ్‌పోర్టల్స్‌కు కేవలం సేవలు మాత్రమే అందించానని, ఇతర ఉద్యోగాల మాదిరిగానే దీనిని ఎంపిక చేసుకున్నానని రవి చెప్పినట్టు సమాచారం. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వ్యాపారం చేయాలని భావించానని, పైరసీని పోటీలేని వ్యాపారంగా భావించి దానిని ఎంచుకున్నట్లు పోలీసులకు తెలిపినట్టు తెలుస్తోంది.
ALSO READ:Telangana Farmers | తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్…క్వింటాల్‌కు 500 బోనస్
అయితే విచారణలో పూటకో మాట, పొంతనలేని సమాధానాలు ఇస్తూ తాను అమాయకుడినన్న భావన కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాడని అధికారులు అంటున్నారు.
పోలీసుల దర్యాప్తు ప్రకారం రవి గత ఆరేళ్లలో సుమారు 21 వేల సినిమాలను పైరసీ చేసి ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌పోర్టల్స్‌లో అప్‌లోడ్ చేసినట్టు తేలింది.
పట్టుబడకుండా ఉండేందుకు ప్రహ్లాద్‌కుమార్ అనే కల్పిత వ్యక్తిని సృష్టించి, అతడి పేరుతో పాన్‌కార్డు, ఆధార్, డ్రైవింగ్ లైసెన్సు, వెబ్‌పోర్టల్స్ కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. కరీబియన్ దేశమైన సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ పౌరసత్వం కూడా అదే పేరుతో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
మిత్రుడు ప్రసాద్ డిజిటల్ సంతకంతో ఆర్థిక లావాదేవీలు సాగినట్టు తేలగా, ఈ మొత్తం వ్యవహారంలో తాను నామమాత్రమేనని నిరూపించేందుకు రవి ముందుగానే వ్యూహం వేసుకున్నట్టు అధికారులు భావిస్తున్నారు. ప్రహ్లాద్ ఎవరో చెప్పేందుకు రవి ఇప్పటికీ మౌనం పాటిస్తున్నాడు.
