ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఆకస్మికంగా మొదలైన ఈ వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండక, చాలామంది తడిసి ముద్దయ్యారు.
బేగంబజార్, కోఠి, బషీర్‌బాగ్, నాంపల్లి, లక్డీకాపూల్, అమీర్‌పేట, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, ప్యాట్నీ, మారేడుపల్లి వంటి ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. నీరు నిలిచిపోవడం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ జామ్‌లతో నగరమంతా స్థంభించింది.
వర్షానికి బస్సులు, ద్విచక్ర వాహనాలు నెమ్మదిగా కదులుతూ రోడ్లపై భారీగా క్యూలు ఏర్పడ్డాయి. ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని చక్కదిద్దేందుకు తీవ్రంగా శ్రమించారు. పలు చోట్ల మానవ శ్రంఖలలు ఏర్పడి వాహనాలను గమ్యస్థానాలకు తరలించేందుకు సహాయపడ్డారు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, రాబోయే మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అలాగే, గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.