మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో కేంద్ర సర్వీస్ ల అధికారులు క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా మంగళవారం పర్యటించారు. నాలుగు రోజులపాటు గ్రామంలో పర్యటించనున్న ఆరుగురు సభ్యుల బృందం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. మొదటి రోజు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సౌకర్యాలను వారు పరిశీలించారు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులతో మాట్లాడిన బృందం సభ్యులు ప్రభుత్వం నుండి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల, మన ఊరు మనబడి అభివృద్ధి కార్యక్రమాలను వారు పరిశీలించారు. స్థానిక అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల సందర్శించారు, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని వారు పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సౌజిలోద్దీన్, తాజా మాజీ సర్పంచ్ శంకర్, పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.