శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఈ బెదిరింపుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలు, చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానాలకు ఈ బెదిరింపులు వచ్చాయి. బెదిరింపులు రావడంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది, సెక్యూరిటీ అధికారులు రంగంలోకి దిగారు. మూడు విమానాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఎక్కడా పేలుడు పదార్ధాలు లభించకపోవడంతో ఫేక్ బెదిరింపులుగా భావిస్తున్నారు. ఈ కలకలం ప్రజలకు ఆందోళన కలిగించింది.
గత కొన్ని రోజులుగా పలు విమానాలకు ఇలాంటి బెదిరింపులు వస్తుండటంతో అధికారులు మరింత అప్రమత్తమవుతున్నారు. అధికారులు ఈ బెదిరింపు కాల్స్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. విమానాశ్రయం సిబ్బంది ప్రయాణికుల భద్రతను పటిష్టంగా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఫేక్ బెదిరింపుల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతానికి బెదిరింపులు పట్ల సీఐఎస్ఎఫ్ బృందం నిఘా కొనసాగిస్తోంది.