Ali Mohammad Naeini: ఇజ్రాయెల్, అమెరికాతో కొనసాగుతున్న యుద్ధంలో ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) అధికార ప్రతినిధి జనరల్ అలీ మొహమ్మద్ నైని దాడిలో మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా, అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి.
రాత్రి జరిగిన వైమానిక దాడుల్లో ఆయన హతమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని రాయిటర్స్, ఏపీ వంటి సంస్థలు కూడా ఇరాన్ ప్రభుత్వ వర్గాల ఆధారంగా నివేదించాయి.
అలీ మొహమ్మద్ నైని ఐఆర్‌జీసీ తరఫున యుద్ధంపై పదేపదే ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇరాన్ వద్ద మిస్సైళ్ల కొరత లేదని, యుద్ధం కొనసాగుతున్నా క్షిపణుల తయారీ ఆగలేదని ఆయన ఇటీవలే చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
ఆయన మరణం ఇరాన్ సైనిక ప్రచార యంత్రాంగానికి ప్రతీకాత్మకంగా పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.
ఇప్పటికే ఇరాన్‌లో పలువురు కీలక నాయకులు దాడుల్లో మరణించినట్టు వివిధ అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి. ఈ పరిణామాల మధ్య కూడా తాము యుద్ధాన్ని ఆపబోమని, శత్రువు అలసిపోయే వరకు పోరాటం కొనసాగుతుందని ఐఆర్‌జీసీ వర్గాలు స్పష్టం చేశాయి.
ప్రాంతీయ ఉద్రిక్తతలతో గల్ఫ్ దేశాల్లో భద్రతా ఆందోళనలు, ఇంధన మార్కెట్లలో అస్థిరత మరింత పెరిగాయి.










