- కిసాన్ మేళాను ప్రారంభించిన సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు
- పాల్గొన్న శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
వ్యవసాయం లాభసాటిగా మారాలంటే రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆరుగాలం కష్టపడ్డ రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. ఉత్తర కోస్తాకు అనువైన లాభసాటి వ్యవసాయ విధానాలు అనే అంశంపై ఆచార్య యన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా స్థానం, రాగోలు, జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న “కిసాన్ మేళా” ను రాగోలు వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో శనివారం ఆయన ప్రారంభించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు అధ్యక్షతన జరిగిన ఈ కిసాన్ మేళాలో ముఖ్య అతిథిగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవసాయ శాఖ పై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. మార్టేరు ను తలదన్నేలా రాగోలు పరిశోధన స్థానాన్ని అభివృద్ధి చేస్తామని, శ్రీకాకుళం సన్నాల బియ్యంకు ప్రపంచ ఖ్యాతి వచ్చేలా కృషి చేస్తామన్నారు
“పొలం పిలుస్తుంది” కార్యక్రమం ద్వారా ప్రతి వారంలో రెండు రోజులు వ్యవసాయ, దాని అనుబంధ శాఖల అధికారులు,రైతులు దగ్గరికి వెళ్లి పొలాలు చూసి రైతులతో మాట్లాడి వారికి ఏ ఏ అవసరాలు ఉన్నాయో, కష్టాలు ఏంటి? బాధలు ఏంటని? తెలుసుకొని తద్వారా పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. తన శాఖకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరుతానన్నారు. జిల్లాలో సకాలంలో నీరు అందక ప్రతి సంవత్సరం కరువు, కాటకాలతో వ్యవసాయం చేయలేక వలసలు వెళ్లే వారి సంఖ్య పెరుగుతుందని, దానిని నిరోధించాలని చెప్పారు. అత్యంత ప్రాధాన్యత రంగమైన వ్యవసాయాన్ని గత ఐదేళ్లు పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేయడం, కేటాయించిన బడ్జెట్ ఖర్చు చేయకపోవడంతో రైతు పరిస్థితి ఘోరంగా మారిందని అన్నారు. సబ్సిడీపై యంత్రాలను, డ్రోన్లను అందిస్తామని, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, ప్రతి సంవత్సరం భూమికి భూసార పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలకు డ్రోన్ల సాంకేతికతను అందుబాటులో ఉంచామని, రైతులు గ్రూపులుగా ఏర్పడి వాటి సేవలు తక్కువ ధరకు పొందవచ్చని చెప్పారు. పాఠశాల స్థాయి విద్యార్థులు కూడా తరచూ ఇలాంటి మేళా లకు హాజరై కొత్త విషయాలు నేర్చుకునేలా ప్రోత్సహించాలన్నారు.
నరసన్నపేట, శ్రీకాకుళం ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, గొండు శంకర్ లు మాట్లాడుతూ లాభదాయక వ్యవసాయ విధానాలపై రైతులకు సంపూర్ణ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లా అదృష్టం కొద్దీ వ్యవసాయ శాఖకు మంత్రిగా అచ్చెన్నాయుడు ఉన్నారని, రైతుల ప్రయోజనాల కోసం ఆయన ఎంత దూరమైనా వెళ్లగలరని చెప్పారు. నైపుణ్యాభివృద్ధికి సాంకేతికతను జోడించి యువతను ఈ రంగం వైపు ఆకర్షితులు అయ్యేలా ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో తోలత వివిధ శాఖలు ఏర్పాటుచేసిన వ్యవసాయ ఉత్పత్తి ప్రదర్శనలను ఆసక్తికరంగా తిలకించారు.
కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యాజమాన్య పద్ధతులపై ప్రచురించిన పలు పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు. ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిధ్యాలయం ఉప కులపతి డాక్టర్. ఆర్.శారద జయలక్ష్మి దేవి, పరిశోధన సంచాలకులు డాక్టర్ పి. వి. సత్యనారాయణ, విస్తరణ సంచాలకులు డాక్టర్ జి. శివనారాయణ, వ్యవసాయ విశ్వ విధ్యాలయం డీన్ డా. సి.హెచ్. శ్రీనివాస రావు, డైరెక్టర్ సీడ్స్ డా. వై. సతీష్, శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ అధికారి కె. త్రినాధ స్వామి, డాక్టర్ దానేటి శ్రీధర్, ఉత్తరకోస్తా మండల వ్యవసాయ శాఖాధిపతులు, పెద్ద సంఖ్యలో జిల్లా నుండి రైతులు, ఎఫ్పిఓ, ఎన్జీవో, వ్యవసాయ కళాశాల, వ్యవసాయ ఇంజినీరింగ్ డిప్లమో విద్యార్ధులు ఈ మేళాలో పాల్గొన్నారు.
