Home Telangana CV Anand | తెలంగాణలో ఎమర్జెన్సీకి ఒకే నంబర్.. ఇక అన్ని సేవలకు డయల్ 112

CV Anand | తెలంగాణలో ఎమర్జెన్సీకి ఒకే నంబర్.. ఇక అన్ని సేవలకు డయల్ 112

0
CV Anand | తెలంగాణలో ఎమర్జెన్సీకి ఒకే నంబర్.. ఇక అన్ని సేవలకు డయల్ 112
Telangana DGP CV Anand inaugurating Dial 112 emergency call center at Integrated Command Control Center.

Telangana Dial 112: తెలంగాణలో అత్యవసర సేవల వ్యవస్థను మరింత ఆధునీకరించే దిశగా పోలీస్ శాఖ కీలక అడుగు వేసింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న డయల్ 100 సేవల స్థానంలో డయల్ 112ను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కొత్త ఎమర్జెన్సీ కాల్ సెంటర్‌ను డీజీపీ సీవీ ఆనంద్(CV Anand) ప్రారంభించారు. ఇకపై పోలీస్ సహాయం, అంబులెన్స్, అగ్నిమాపక సేవలు, ఇతర అత్యవసర పరిస్థితులకు ఒకే నంబర్‌ 112ను సంప్రదించాల్సి ఉంటుంది. రోడ్డు ప్రమాదాలు, దోపిడీలు, గొడవలు, వేధింపులు వంటి సమస్యలపై కాల్ చేసిన వెంటనే సమీపంలోని పోలీస్, ఫైర్ రెస్పాన్స్ బృందాలకు సమాచారం చేరేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు.

డయల్ 112 ఎమర్జెన్సీ సేవలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేక వసతులతో రెండు అంతస్తులను సిద్ధం చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు.  అత్యవసర కాల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని సిబ్బందికి సూచించారు. న్యాయ, వైద్య, సైబర్ సంబంధిత సమస్యలకు కూడా డయల్ 112 ద్వారా సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. అధునాతన లొకేషన్ ట్రాకింగ్ వ్యవస్థ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో కాల్స్‌ను వేగంగా గుర్తించి స్పందించేలా చర్యలు తీసుకుంటున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో కాలర్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి, సమీప సహాయక బృందాలకు సమాచారం పంపించే విధానం అమల్లోకి వచ్చింది. డయల్ 112 సేవలు 24 గంటలు, ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయని డీజీపీ తెలిపారు. భవిష్యత్‌లో డ్రోన్ టీమ్‌లను కూడా వినియోగంలోకి తీసుకువచ్చి అత్యవసర స్పందన వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.