Sonam Wangchuk: నీట్ పరీక్షల వ్యవహారంపై కొనసాగుతున్న ఆందోళనలకు కొత్త మలుపు వచ్చింది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, తన దీక్ష విరమణకు ఒక కీలక షరతు పెట్టారు. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి ప్రతీకార చర్యలు, చట్టపరమైన కేసులు నమోదు చేయబోమని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా హామీ ఇస్తేనే తాను దీక్షను ముగిస్తానని ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లకు లేఖ రాసిన ఆయన, న్యాయమైన విద్యా వ్యవస్థ కోసం గొంతెత్తిన విద్యార్థులను శిక్షించడం సరికాదని పేర్కొన్నారు.
నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై జవాబుదారీతనం నిర్ధారించడంతో పాటు విద్యా సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించినప్పటికీ, తన డిమాండ్లపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, నిరసనల సందర్భంగా పోలీసులతో ఆందోళనకారులకు వాగ్వాదాలు, ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటుచేసుకున్నాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విద్యార్థుల హక్కుల పరిరక్షణతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఉద్యమం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని వాంగ్‌చుక్ చేసిన విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది.
ALSO READ: E20 పెట్రోల్‌పై కేంద్రం క్లారిటీ.. ఇంజిన్ దెబ్బతింటుందా? అసలు నిజం ఇదే








