Congress Protest: నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా రాజకీయ వేడి కొనసాగుతోంది. పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే విద్యార్థి సంఘాలు, పలు రాజకీయ పార్టీలు నిరసనలు చేపడుతుండగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ మరింత బలపడుతోంది.
ఈ పరిణామాల మధ్య మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారిక నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించడంతో రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆందోళనలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు.
పీఎం నివాసం సమీపంలో రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ నేతలు, నీట్ పరీక్షలో అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిన కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోదీ స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రజలకు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కోరారు. నిరసనల నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
ALSO READ: TG TET | తెలంగాణ టీచర్లకు అలర్ట్.. జూలై 22 నుంచి టెట్ దరఖాస్తులు








