Indians Return: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సంక్షోభంలో ఇప్పటివరకు ఐదుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గల్లంతయ్యారు. ఒమన్లోని సోహర్ నగరంలో మరణించిన ఇద్దరి మృతదేహాలను జైపూర్లోని వారి కుటుంబాలకు ఇప్పటికే తరలించారు.
ఇరాన్ నుంచి అర్మేనియా, అజర్బైజాన్ మార్గాల ద్వారా సుమారు 700 మంది భారతీయులను సురక్షితంగా తరలించారు. వీరిలో 284 మంది యాత్రికులు ఉండగా, అందులో 130 మంది ఢిల్లీకి చేరుకోనున్నారు. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు మొత్తం 2.44 లక్షల మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.
కువైట్ వైమానిక మార్గం మూసివేయబడినప్పటికీ, సౌదీ అరేబియా మార్గం ద్వారా ప్రత్యేక విమానాలతో తరలింపు కొనసాగుతోంది. యూఏఈ, ఒమన్, ఖతార్ దేశాల నుంచి పరిమిత విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.
ఈ సమస్యపై బ్రిక్స్ దేశాల మధ్య ఏకాభిప్రాయం కష్టంగా మారినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంధన భద్రతపై ప్రభావం ఉండొచ్చని భావిస్తూ, దౌత్య మార్గాల ద్వారానే సమస్య పరిష్కారం కావాలని భారత్ స్పష్టం చేసింది. భారతీయుల భద్రతే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం మరోసారి హామీ ఇచ్చింది.







