Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్‌లను రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మిత్రుడు, శత్రువు అనే తేడా లేకుండా ప్రపంచ దేశాలపై సుంకాల బెదిరింపులకు పాల్పడుతున్న ట్రంప్, ఈసారి ఫ్రాన్స్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.
ఫ్రాన్స్‌కు చెందిన వైన్, షాంపైన్ ఉత్పత్తులపై 200 శాతం టారిఫ్‌లు విధిస్తామని ఆయన హెచ్చరించారు.
గాజా శాంతిమండలిలో చేరాలన్న తన ఆహ్వానాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తిరస్కరించడమే ట్రంప్ ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది.
ఈ మేరకు తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్’లో ట్రంప్ పోస్టు చేశారు. “నేను వైన్లు, షాంపైన్లపై 200 శాతం టారిఫ్‌లు విధిస్తాను. అప్పుడు మెక్రాన్ తప్పకుండా శాంతిమండలిలో చేరతారు” అంటూ వ్యాఖ్యానించారు.
ALSO READ:Medaram Jatara Buses | మహిళలకు స్పెషల్ బస్సుల్లోనూ ఫ్రీ ట్రావెల్
అలాగే మెక్రాన్ పంపిన ప్రైవేట్ మెసేజ్‌ను కూడా ట్రంప్ బహిర్గతం చేశారు. ఇరాన్, సిరియా అంశాల్లో ఏకాభిప్రాయం ఉందని, కానీ గ్రీన్‌లాండ్ విషయంలో ట్రంప్ వైఖరి అర్థం కావడం లేదని మెక్రాన్ సందేశంలో పేర్కొన్నట్టు తెలిపారు.
దావోస్ సమావేశం అనంతరం పారిస్‌లో జీ7 భేటీ నిర్వహించాలని, అమెరికా పర్యటనకు ముందు డిన్నర్‌కు ఆహ్వానించినట్లు ఆ సందేశంలో ఉంది.
ఈ పరిణామాలతో అమెరికా–ఫ్రాన్స్ మధ్య దౌత్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.







