రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని జీవోలను నాలుగు వారాల్లో బహిర్గతం చేసి పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు.
జీవోలు దాచిపెట్టడంపై విమర్శ
ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జీవోలను దాచిపెట్టి డ్రామాలు చేస్తోందని హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (PIL) వల్ల ప్రభుత్వ వైఖరి బయటపడిందని పేర్కొన్నారు.
ALSO READ:Manchu Lakshmi | బెట్టింగ్ యాప్‌ల కేసులో సీఐడీ విచారణ
13 నెలల్లో 19,064 జీవోలు
2023 డిసెంబర్ 7 నుంచి 2025 జనవరి 1 వరకు మొత్తం 13 నెలల కాలంలో ప్రభుత్వం 19,064 జీవోలు జారీ చేసిందని హరీశ్ రావు తెలిపారు. అయితే వాటిలో కేవలం 3,290 జీవోలను మాత్రమే పబ్లిక్ డొమైన్‌లో ఉంచడంలో ఉన్న అంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
82 శాతం జీవోలు గోప్యంగా
ఒకే ఏడాదిలో 15,774 జీవోలు అంటే సుమారు 82 శాతం జీవోలను దాచిపెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు. ‘ఇదేనా మీరు చెప్పుకునే ప్రజా ప్రభుత్వం?’ అంటూ సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్ రావు ప్రశ్నించారు.
