పారిశుద్ధ కార్మికులకు కనీస వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ ఇంద్ర పార్క్ లో నిర్వహించనున్న మహాసభకు వెళ్తున్న కార్మికులను నిజాంపేట పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ చర్యను కార్మికులు తీవ్రంగా ఖండించారు.
కార్మికులు మాట్లాడుతూ, మురికివాడల్లో పనిచేసే తమను ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యవసరాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తమ జీతాలు మాత్రం చాలా తక్కువగా ఉండి, జీవనం సులభంగా సాగడం లేదన్నారు. మహాసభ ద్వారా తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని సంకల్పించామని చెప్పారు.
అయితే, మహాసభకు వెళ్తున్న తమను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని పేర్కొన్నారు. ఈ అరెస్టులకు తాము భయపడేది లేదని, తమ సమస్యలు పరిష్కరించేవరకు పోరాటం కొనసాగిస్తామని కార్మికులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్మికులు రవి, ఏసు, బత్తుల రాములు, వాటర్ మెన్ రాజు, కిషన్, మల్లేశం, మైసయ్య, కుమార్, గవ్వల నరసవ్వ, కొమ్మట శ్యామల తదితరులు పాల్గొన్నారు. మహాసభను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడంలో విఫలమైందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.