జర్నలిస్టుల రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం చేయాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అన్నారు. పాత్రికేయులపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో విజయనగరం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి రిపోర్టర్ మల్వాడా రామారావుపై టీడీపీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు దాడి చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ఘటనను నిరసిస్తూ ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డీఐజీలు, కమిషనర్లు, కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు.
విశాఖలో డీఐజీ కార్యాలయం వద్ద జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఏయూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన అనంతరం ర్యాలీగా డీఐజీ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలని, రక్షణ కోసం ప్రభుత్వం చట్టం చేయాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం ఉన్న నాయకులను చూసి కొత్త తరం నాయకులు నేర్చుకోవాలని గంట్ల శ్రీనుబాబు సూచించారు. ఎదిగే కొద్ది ఒదిగి ఉండాల్సిన అవసరం ఉందని, జర్నలిస్టులను బెదిరించడం అసహ్యకరమని విమర్శించారు. ప్రజాశక్తి పాత్రికేయుడు రామారావుపై దాడి చేసిన వేణుగోపాల్ నాయుడును తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ బ్రాడ్‌కాస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వరరావు, కార్యదర్శి మధన్, ఉపాధ్యక్షుడు మళ్ల దేవత్రినాధ్, ఏపియూడబ్ల్యూజె అర్బన్ కార్యదర్శి రామచంద్రరావు, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్‌మోహన్, సీనియర్ పాత్రికేయులు అప్పలనాయుడు, వెంకటేష్, ఇతర జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వినతిపత్రం పరిశీలించిన అధికారులు, డీఐజీ గోపినాధ్ జెట్టి దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.