PM Modi: సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓఇన్‌ఫ్లుయెన్సర్ రీల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ యువరాజ్ దువా తన తండ్రి చక్కెర ఎక్కువగా తీసుకుంటున్నారని, మోదీజీ చెబితే మాత్రం మాట వినే అవకాశం ఉందని సరదాగా చేసిన రీల్ నెట్టింట విపరీతంగా వైరల్ అయింది.
ఈ వీడియోలో తన తండ్రి ప్రధానమంత్రి మోదీకి పెద్ద అభిమాని అని, ఆయన చెప్పే మాటలను ఎంతో ప్రాముఖ్యంగా తీసుకుంటారని యువరాజ్ పేర్కొన్నాడు.
అందుకే చక్కెర వినియోగాన్ని తగ్గించాలని తన తండ్రికి మోదీ సూచించాలని కోరాడు. ఈ వినూత్న అభ్యర్థన నేరుగా ప్రధాని దృష్టికి చేరడమే కాకుండా, ఆయన తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆ రీల్‌ను షేర్ చేయడం విశేషంగా మారింది.
యువరాజ్ అభ్యర్థనకు స్పందించిన ప్రధాని మోదీ, అతని తండ్రితో పాటు అందరికీ చక్కెర వినియోగం తగ్గించాలని సూచించారు. “ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి” అనే సందేశంతో పాటు, అధిక చక్కెర వాడకం అనేక రకాల వ్యాధులకు దారితీస్తుందని, ముఖ్యంగా ఊబకాయం ముప్పును పెంచుతుందని హెచ్చరించారు.
viral video:https://www.instagram.com/reel/DVyIWeTkUnW/?utm_source=ig_web_button_share_sheet
ఆరోగ్యకర జీవనశైలిని అలవాటు చేసుకోవాలని, యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని కూడా సూచించారు. ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంచే దిశగా సామాజిక మాధ్యమాలను వినియోగించడం ద్వారా మోదీ మరోసారి ప్రత్యేక దృష్టి ఆకర్షించారు.
తన రీల్‌ను స్వయంగా ప్రధాని షేర్ చేయడంతో యువరాజ్ దువా ఆనందం వ్యక్తం చేశాడు. తన వీడియో ప్రధాని వరకు చేరుతుందని అసలు ఊహించలేదని, ఇది తనకు ఆశ్చర్యకరమైన మరియు మరపురాని క్షణమని పేర్కొన్నాడు.
ఈ సంఘటనతో ఆ రీల్ మరింత వైరల్ అయి, సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. సరదాగా ప్రారంభమైన ఒక వీడియో, చివరికి ఆరోగ్య సందేశాన్ని దేశవ్యాప్తంగా చర్చకు తీసుకురావడం విశేషంగా మారింది.








