Nitish Kumar: బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు తిరగనుంది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన నితీష్ కుమార్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈరోజు ఆయన రాజ్యసభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనుండగా, అనంతరం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం. దీంతో రాష్ట్రంలో కొత్త నాయకత్వంపై ఉత్కంఠ నెలకొంది.
మార్చి 30న శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన నితీష్ కుమార్, ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో మరింత చురుకుగా వ్యవహరించే అవకాశముంది. ఇదిలా ఉండగా, ప్రభుత్వం మారినా పాలనలో ‘నితీష్ మోడల్’ కొనసాగుతుందని జేడీయూ నేతలు చెబుతున్నారు.
ఇక కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ వర్గాల్లో చర్చలు వేగం పుంజుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని సీఎం అభ్యర్థిగా ప్రోత్సహిస్తూ పోస్టర్లు వెలగడం రాజకీయ వేడిని పెంచింది. అయితే పార్టీ అధిష్టానం దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ కోర్ గ్రూప్ కీలక సమావేశం జరగనుంది. ఇందులో బీహార్ భవిష్యత్ నాయకత్వంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్ 14న జరగనున్న ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో కొత్త ముఖ్యమంత్రి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
దీంతో నితీష్ శకం ముగుస్తుందా? కొత్త సీఎం ఎవరు? అన్న ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.








