శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్, రెండు ఫిషింగ్ జెట్టీలు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి శర్బానంద సోనోవాలుకు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు లేఖ రాశారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో 197 కి.మీ సముద్ర తీర ప్రాంతం ఉండటంతో మత్స్యకారులకు ప్రోత్సాహం కల్పించేందుకు ఈ హార్బర్ అవసరమని వివరించారు.
శ్రీకాకుళం జిల్లాలో 230కి పైగా గ్రామాల ప్రజలు ప్రధానంగా మత్స్యకారులుగా జీవిస్తున్నారని, వారికి ఆధునిక మత్స్యకార సౌకర్యాలు అవసరమని రామ్మోహన్ నాయుడు లేఖలో పేర్కొన్నారు. సముద్ర తీర ప్రాంత ప్రజల జీవనోపాధిని మెరుగుపరిచేలా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సంతబొమ్మాళి మండలం భావనపాడు వద్ద ఫిషింగ్ పోర్ట్ ఏర్పాటు చేయాలని ఆయన లేఖలో అభిప్రాయపడ్డారు. దీనివల్ల మత్స్యకారులకు మెరుగైన వృత్తి అవకాశాలు లభించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోనూ పెరుగుదల చోటుచేసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మత్స్యకారుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.
రాష్ట్రంలో సముద్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ హార్బర్ ఎంతో ఉపయోగకరమని నాయుడు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మత్స్యకారుల అభివృద్ధికి అవసరమైన అన్ని సహాయాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని కోరారు.