Hyderabad Petrol: హైదరాబాద్‌లో ఇంధన కొరత ఉందన్న వార్తలను పోలీసులు ఖండించారు. నగరంలో పెట్రోల్, డీజిల్ సరిపడా నిల్వలు ఉన్నాయని, సుమారు 60 రోజుల అవసరానికి సరిపడే స్టాక్ అందుబాటులో ఉందని పోలీస్ కమిషనర్ తెలిపారు.
సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాల వల్ల ప్రజలు భయాందోళనకు గురై ఒకేసారి బంకులకు వెళ్లి ఫుల్ ట్యాంక్ చేయించుకోవడంతో డిమాండ్ అకస్మాత్తుగా పెరిగిందని చెప్పారు.
ఈ కారణంగా కొన్ని బంకుల్లో తాత్కాలికంగా “నో స్టాక్” బోర్డులు కనిపిస్తున్నాయని, దీన్ని అసలు కొరతగా భావించవద్దని సూచించారు.
ఇక బాటిళ్లు లేదా డబ్బాల్లో పెట్రోల్, డీజిల్ తీసుకెళ్లడంపై పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లూజ్‌గా ఇంధనం విక్రయించడం చట్ట విరుద్ధమని, అలాంటి చర్యలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇటీవల రోజువారీ ఇంధన విక్రయాలు ఒక్కసారిగా పెరగడం కూడా ఈ అపోహల ప్రభావమేనని వెల్లడించారు.
మరోవైపు నగరంలోని పెట్రోల్ బంకులపై అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. సివిల్ సప్లై, రెవెన్యూ శాఖలతో కలిసి పరిస్థితిని సమీక్షిస్తూ సరఫరా సజావుగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నగరంలోని ఎక్కువ బంకుల్లో ఇంధన సరఫరా సాధారణంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ప్రజలు అపోహలకు లోనవకుండా, అవసరమైనంత మాత్రమే ఇంధనం తీసుకోవాలని, బంకుల వద్ద అనవసరంగా రద్దీ సృష్టించవద్దని అధికారులు సూచించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.







